తెలుగు టివి డిబేట్లు
"సర్ నమస్తే, ఎలా ఉన్నారు, ఈరోజు సాయంత్రం 7-8 లైవ్ ఉంది, కాస్త మీ టైమ్ కావాలి" అవతలి నుండి టివి ఛానెల్ కోఆర్డినేటర్ ఫోన్.
"బాగున్నాను, మీరెలా ఉన్నారు? నేను ఈ మధ్య మీడియా యాక్టివిటీస్ తగ్గించుకున్నాను సర్, వేరే ఎవరినైనా ప్లాన్ చేయండి" ఇవతలి నుండి నా సమాధానం.
"సరే.. నాకు జూమ్ లింక్ పంపించండి చేద్దాం" - నా సమాధానం.
టివి ఛానెళ్ల డిబేట్స్ జరిగేటప్పుడల్లా చాలా సందర్భాల్లో నా సంభాషణ ఇలా ఉంటుంది.
సరేనని.. జూమ్ లోనో, నేరుగా ఛానెల్‌కి వెళ్లో లైవ్‌లో కూర్చుంటాం. రకరకాల రాజకీయ పార్టీల నుండి అతి రధ మహారధులైన స్పోక్స్ పర్సన్స్ వాడీ వేడిగా ఫైట్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు.
లైవ్ టైమ్ అవుతుంది. హోస్ట్ "నమస్కారం... ఇప్పుడు రాష్ట్రంలో ఫలానా అంశం గురించి వివాదం నడుస్తోంది. సాంకేతికంగా దీంట్లో చాలా లోపాలు ఉండే అవకాశాలున్నాయి, దీని గురించి ఈరోజు మనకు వివరించడానికి టెక్నాలజీ నిపుణులు, ప్రముఖ టెక్ గురు నల్లమోతు శ్రీధర్, ఫలానా రాజకీయ పార్టీ నాయకులు x, ఫలానా పార్టీ నుండి Y, మహిళా సంఘాల నేత z స్టూడియోలో ఉన్నారు. అందరికీ నమస్కారం. శ్రీధర్ గారు మొదట మీరు చెప్పండి.. పెగాసన్ అనేది అసలు ఏమిటి, దాని గురించి రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణల్లో నిజమెంత?" బాల్ వచ్చిన నా కోర్టులో పడుతుంది సహజంగానే మొదట.
కర్రా విరక్కుండా పాము చావకుండా ఎవన్నీ నొప్పించకుండా నా సరిహద్దులు నేను చూసుకుంటూ.. చాలా లౌక్యంగా సమాధానం చెబుతాను, టాపిక్ వివరిస్తాను. మొదటి ఐదు నిముషాలు నాకు కేటాయించాక.. ఇక బాల్ కోర్టులు మారిపోతూ ఉంటుంది.
"శ్రీధర్ గారు చెప్పారు కదా, అలానూ సాధ్యపడొచ్చు, ఇలానూ సాధ్యపడొచ్చు, మీరేమంటారు" అంటూ యాంకర్ ప్రతీ రాజకీయ పార్టీ ప్రతినిధిని అడుగుతారు. మొదట చాలా పద్ధతిగా మాట్లాడుకునే వాళ్లు కాస్తా మెల్లగా గొంతులు పెంచి, కొన్నిసార్లు "నువ్వెంత అంటే నువ్వెంత" అనే స్థాయికి వెళుతుంది.
వాళ్లకి చెప్పీ చెప్పీ విసుగొచ్చి. "ఒక్క నిముషం.. ఒక్క నిముషం రాజేశ్వరరావు గారు, కుమార్ గారు... మళ్లీ మీ దగ్గరకు వస్తాను, శ్రీధర్ గారితో ఓసారి మాట్లాడదాం" అంటూ వాతావరణం తేలిక చెయ్యడానికి యాంకర్ మళ్లీ నన్ను పావుగా వాడుకుంటారు.
ఇలాంటి కొన్ని వందల డిబేట్లు పార్టిసిపేట్ చేసీ చేసీ.. ఈ మధ్య బాగా తెలిసిన, బాగా పరిచయం ఉన్న పెద్ద పెద్ద జర్నలిస్టులు చనువు కొద్దీ అడిగితేనే డిబేట్లలో పార్టిసిపేట్ చేస్తున్నాను.
రెండు పార్టీలు కొట్టుకోవడానికి మాత్రమే డిబేట్.. మధ్యలో చూసే ప్రేక్షకులకు న్యూట్రాలిటీ ఉంది అని నిరూపించుకోవడానికి నాబోటి నిపుణులు రంగంలో ఉంటారు.. ఆ కొట్టుకునే వాళ్ల మధ్య నలిగిపోవడానికి! గంట సేపు లైవ్ చూస్తే చూసే జనాలకు ఒరిగేది ఏమీ లేదు.. పార్టీలకు ఒరిగేది ఏమీ లేదు.. ఛానెల్లో కూర్చున్న రాజకీయ పార్టీల ప్రతినిధులు మాత్రం.. మధ్యలో ఇళ్లకి వాట్సప్ కాల్ చేసి "మీ మామయ్యకి ఛానెల్ లింక్ పంపించు, నా లైవ్ చూస్తారు" అని చెప్పుకోవడం, లేదా ఎవరైనా మెసేజ్ పెడితే పొంగిపోవడం.. టివి ఛానెల్‌కి ఓ గంట సమయం గడవడం...
ఇవన్నీ చూశాక.. అలా బలవంతంగా వాటిలో కూర్చోవడం కన్నా కళ్లు మూసుకుని మెడిటేషన్ చేసుకుంటే కనీసం నా సాధన అయినా సాగుతుంది అన్న భావన.
అప్పుడే భగవద్గీత కూడా నాకు బోధపడుతుంది... శ్రీకృష్ణుడు నా చెవిలో ఇలా చెబుతాడు...
"శ్రీధరా అనివార్యమగు రాజకీయ పార్టీలు కొట్టుకొనుట అను కర్మ గురించి నువ్వు బాధపడవలదు, నువ్వు నిమిత్త మాత్రుడవి మాత్రమే" అని! ఆ మాటలు వినపడగానే మరింత కామ్ అవుతాను 
- Sridhar Nallamothu
Comments
Post a Comment